వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం

వరంగల్‌లో భారీ అగ్నిప్రమాదం

బాణసంచా గోదాంలో చెలరేగిన మంటలు
11 మంది కార్మికుల సజీవదహనం
మృతుల సంఖ్య పెరిగే అవకాశం?


కోటిలింగాల: వరంగల్‌ కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్‌ వర్స్క్ గోదాంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తుపట్టలేని విధంగా మారాయి. శిథిలాల కింద మరో రెండు, మూడు మృతదేహాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా.విశ్వనాథర్‌ రవీందర్‌, డీసీపీ, ఏసీపీ తదితరులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.


కోటిలింగాలలోని భద్రకాళి ఫైర్‌ వర్క్స్ గోదాములో బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీ శబ్దాలతో బాణసంచా పేలింది. ఆ సమయంలో గోదాములో 25 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే పలువురు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. 11 మంది కార్మికులు మంటల్లో సజీవ దహనమయ్యారు. మరికొంత మంది ఆచూకీ తెలియకపోవడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అసలు విషయం తెలుసుకుని వెంటనే ప్రమాదస్థలానికి పరుగులు తీశారు. కార్మికుల మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉపముఖ్యమంత్రి కడియం దిగ్భ్రాంతి

కోటిలింగాలలో అగ్నిప్రమాద ఘటనపై ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి వెంటనే వెళ్లి సహాయచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అగ్నిప్రమాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.


 

Comments

Popular posts from this blog

కనిపిస్తే కబ్జా!