కుగ్రామంలో పుట్టి.. అత్యున్నత పదవి చేపట్టి

కుగ్రామంలో పుట్టి.. అత్యున్నత పదవి చేపట్టి
సీబీఐ నూతన డైరెక్టర్‌ నాగేశ్వరరావు ప్రస్థానం 
 
వరంగల్‌: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నూతన సంచాలకుడిగా మన్నెం నాగేశ్వరరావు అరుదైన అవకాశం దక్కించుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామానికి చెందిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత పదవిని చేపట్టారు. దీంతో ఆయన స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అనూహ్య పరిస్థితుల్లో సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వరరావు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తల్లిదండ్రులు మన్నం పిచ్చయ్య, శేషమ్మలకు ఆయన రెండో సంతానం. నాగేశ్వరరావుకు ఓ అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మంగపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకూ చదివిన ఆయన... తిమ్మంపేటలో పదో తరగతి వరకూ చదివారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఏవీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి తరువాత సీకేఎం కళాశాలలో డిగ్రీ చేశారు. ఉస్మానియాలో పీజీ చేస్తున్న సమయంలోనే 1986లో సివిల్స్ రాసి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఒడిశా కేడర్‌లో ఐపీఎస్‌గా చేరినా.. ఎక్కువకాలం ఛత్తీస్‌గఢ్‌లో పని చేశారు. ఒడిశా డీజీపీగా కూడా పనిచేశారు.
దక్షిణాది రాష్ట్రాల జేడీగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ తరువాత ఆ స్థానంలో నాగేశ్వరరావు నియమితులయ్యారు. ప్రస్తుతం సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ని సీబీఐ నూతన డైరెక్టర్‌గా కేంద్రం నియమించింది. నాగేశ్వరరావు కృషి, దీక్ష, అంకితభావమే ఆయన్ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి సీబీఐ డైరెక్టర్ స్ధాయికి తీసుకెళ్లిందని బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 

Comments

Popular posts from this blog

కనిపిస్తే కబ్జా!