కనిపిస్తే కబ్జా!

కనిపిస్తే కబ్జా!
యథేచ్ఛగా చెరువు శిఖం భూముల ఆక్రమణ
జోరుగా  కొనసాగుతున్న నిర్మాణాలు
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
ప్రజలు ఫిర్యాదు చేస్తేనే అక్రమాలు వెలుగులోకి
ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, మడికొండ

చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా ఆక్రమించేస్తున్నారు. యథేచ్ఛగా ప్లాట్లు చేసి భవనాలు కట్టేస్తున్నారు. తూములను రాళ్లతో పూడ్చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తూ ఆక్రమణదారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ, జయశంకర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లోని  నగరాలు, పట్టణాల పరిసరాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. ఫలితంగా అందరి ఆస్తిగా ఉండాల్సిన జల వనరులు ఒకరిద్దరి స్వార్థంతో ఉనికి కోల్పోతున్నాయి.
రాళ్లతో పూడ్చేస్తున్నారు: వరంగల్‌ అర్బన్‌ ్ల మడికొండ వద్దగల సల్ల చెరువు స్వరూపం మారుతోంది. కొందరు వ్యక్తులు గ్రానైటు పరిశ్రమల నుంచి భారీ బండరాళ్లు తీసుకొచ్చి చెరువును పూడ్చేస్తున్నారు. ఇప్పటికే మత్తడి రాళ్లను సైతం తొలగించారు. ఈ అన్యాయాన్ని చూడలేక గ్రామస్థులు ధర్నా చేపట్టి, అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కదిలారు. ఆక్రమణదారులపై తాజాగా కేసు నమోదు చేశారు. గతంలో కట్ట బలోపేతానికి రూ. 50 లక్షలను మిషన్‌ కాకతీయలో కేటాయించి మరమ్మతులు చేశారు. 30 ఎకరాలకుపైగా ఉన్న చెరువు ఇప్పటికే సగం ఆక్రమణకు గురికావడం గమనార్హం.
* ఈ గ్రామంలోని లోతుకుంట పూర్తిగా ఆక్రమణకు గురైంది.  ఒక్క చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. ప్రస్తుతం పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయింది. కుమ్మరికుంటలోని మంగలి కుంటదీ ఇదే పరిస్థితి.

ఆలయాలను అడ్డుపెట్టుకొని..: జనగామ జిల్లాల్లో చెరువు శిఖం భూములను ఆక్రమించేందుకు దేవుణ్ని అడ్డుపెట్టుకుంటున్నారు. పాలకుర్తి మండలం గూడూరు నడిబొడ్డులో ఉన్న ఒక చెరువు శిఖంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్థులు వ్యతిరేకించినా వినకుండా ఒక జిల్లా స్థాయి అధికారి ఈ గుడి కట్టారు. కుటుంబ సభ్యుల పేరిట ఆలయంపై ట్రస్టు ఏర్పాటుచేసి సొంతం చేసుకున్నారు. ఇది వివాదాస్పదం కావడంతో ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపన జరగలేదు. అధికారులు మాత్రం అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
* స్టేషన్‌ఘన్‌పూర్‌లో పుట్టలమ్మకుంటలో మట్టి కోసం అక్రమంగా తవ్వకాలు జరిపారు. భారీ గుంతలు ఏర్పడ్డాయి. అర్ధరాత్రి  అడ్డగోలుగా తవ్వుతున్నా అధికారులు అడ్డుకోవడం లేదు.

వెంచర్లు వెలుస్తున్నాయి..: వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్‌లోని ఊర చెరువు  ఆక్రమణకు గురవుతోంది. కొందరు వెంచర్‌గా మార్చి ప్లాట్లు చేసేశారు. దీనిపై కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదు. మిషన్‌ కాకతీయలో మొదటి దశలోనే లక్షల రూపాయలు పెట్టి మరమ్మతులు చేశారు. ఆక్రమణల కారణంగా వరద నీరు వచ్చే అవకాశం లేకపోవడంతో వర్షాకాలంలో నీళ్లు నిలవలేదు. దీనికింద ఆయకట్టు ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు.
* పరకాల పట్టణంలో ఉన్న దామెర చెరువు 20 ఏళ్లుగా ఆక్రమణలకు గురవుతూ వస్తోంది. అసలు శిఖం 103 ఎకరాలు ఉండాలి. గతంలో కొందరు ఆక్రమించి 40 ఎకరాల వరకు సాగు చేశారు. శిఖం భూముల్లో 30కిపైగా ఇళ్లు వెలిశాయి. 2016 రెవెన్యూ అధికారులు సర్వేచేసి ఆక్రమణలుగా తేల్చారు. నోటీసులు ఇచ్చి చర్య తీసుకుంటామని చెప్పినా ఇప్పటి వరకు ముందడుగు పడలేదు.
* వర్ధన్నపేట మండలం కట్య్రాల చెరువు శిఖం భూమి దాదాపు 5 ఎకరాల వరకు ఆక్రమణకు గురైంది. దీనిపై ఫిర్యాదు అందడంతో అధికారులు చెరువు శిఖం భూమిగా బోర్డు పెట్టి, హద్దు రాళ్లు పాతారు. అయినా ప్రయివేటు వ్యక్తులు బోరు వేసుకొని పంటలు పండిస్తున్నారు.

భారీ నిర్మాణాలు..: మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండల కేంద్రం సమీపంలోని కొండ సముద్రం వద్ద భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఈ చెరువు విస్తీర్ణం మొత్తం 22 ఎకరాలు ఉండగా, అందులో ఇప్పటికే అయిదారు ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైంది. మిషన్‌ కాకతీయలో భాగంగా ట్యాంకు బండుగా మార్చడానికి ఇది ఎంపికైంది.  నిర్మాణం మొదలైతే తమ ఆక్రమణల బాగోతం బయటపడుతుందని కొందరు అడ్డుపుల్ల వేసినట్టు సమాచారం.
* మరిపెడ మండల కేంద్రం సమీపంలోని రంగులకుంట ఆక్రమణకు గురయ్యే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు.
* తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామ శివారు పెద్ద చెరువు ఆవరణలో నిబంధనలకు విరుద్ధంగా క్వారీ నడుస్తోంది. మట్టి, రాళ్లను తవ్వి చెరువు శిఖం భూముల్లో వేయడం వల్ల వరద ప్రవాహం రావడం లేదు. ఈ విషయమై గతంలో గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదుచేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.
* జిల్లాలోని 16 మండలాలుండగా రెవెన్యూ అధికారులు 12 మండలాల్లో ఆక్రమణలకు గురవుతున్న చెరువులు, కుంటలను ఇటీవల పరిశీలించి నివేదికను తయారు చేసి కలెక్టర్‌కు అందజేశారు. ఎప్పటికప్పుడు సమన్వయంతో పని చేస్తూ భూముల్ని కాడాల్సిన నీటిపారుదల, రెవెన్యూ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లనే ఆక్రమణలు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భవనాలు కట్టేస్తున్నారు: జయశంకర్‌ జిల్లాలోనూ చెరువుల ఆక్రమణలు భారీస్థాయిలోనే ఉన్నాయి. కాటారం మండల కేంద్రంలోని ఊర చెరువు శిఖం భూమి కబ్జాకు గురవుతోంది. స్థానిక పంచాయతీ అనుమతులు లేకున్నా..వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకోక పోయినా..అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. అధికారుల కళ్ల ముందే ఇవన్నీ జరుగుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.  71 సర్వేనెంబరులోని 25.26 ఎకరాల విస్తీర్ణంతో శిఖం భూమి ఉండాల్సి ఉండగా సగానికి పైగా ఆక్రమణకు గురైంది. శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఇటీవల శిఖం భూమిని సర్వే చేయించి హద్దులు పాతారు. దీంతో శిఖం భూమిలో కొనసాగుతున్న అక్రమ కట్టడాలను అడ్డుకున్నారు.
* భూపాలపల్లి పట్టణంలో దాదాపు మూడు చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. తుమ్మల చెరువుకు 42 ఎకరాల శిఖం భూమి ఉండగా పది ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఇందులో రెండెకరాల వరకు అన్యాక్రాంతమైనట్టు రెవెన్యూ అధికారులు గుర్తించినా ఎలాంటి హద్దులు పెట్టలేదు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు: చెరువు శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు కట్టొద్దని సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. భూములు దున్ని పంటలు వేసినా, శిఖం భూముల్ని ఇతర అవసరాలకు ఉపయోగించినా, నీటి ప్రవాహం రాకుండా చేసినా, ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు నిర్మించినా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. భూములను కాపాడాల్సింది   రెవెన్యూ శాఖ అధికారులదే. చాలా చోట్ల ఆక్రమణదారులకు వత్తాసు పలకడంతో చెరువు శిఖం భూములు మాయమవుతున్నాయి.
 

Comments