రాలిపోయిన సిరిమల్లె పువ్వు

రాలిపోయిన సిరిమల్లె పువ్వు 

అతిలోక సుందరికి అశ్రునివాళి

 తన అందం అభినయంతో సినీ ప్రేక్షక లోకాన్ని అలరించిన లెజెండ్, అతిలోక సుందరి శ్రీదేవి (54) ఇకలేరు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె తీవ్రమైన గుండెపోటుతో దుబాయ్‌లో కన్నుమూశారు. శ్రీదేవి భర్త బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్, తన ప్రియురాలు అంతర మోతీవాలాని  మంగళవారం పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో హాజరైన శ్రీదేవి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయారు.

శ్రీదేవి మరణించిన సమయంలో భర్త బోని కపూర్‌, కూతురు ఖుషి పక్కనే ఉన్నట్లు చెప్పారు. 1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. శ్రీదేవి అసలు పేరు ‘శ్రీ అమ్మా యాంగేర్‌ అయ్యపాన్‌’. తమిళ్‌, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ఓ పత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
1975 చిన్నతనంలో తునాయివన్‌ సినిమాతో సినీ రంగంలోకి ప్రేవేశించిన శ్రీదేవి.. భారతదేశంలోని గొప్ప నటీమణుల్లో ఒకరిగా ఎదిగారు. తెలుగులో శ్రీదేవి తొలి చిత్రం ‘మా నాన్న నిర్దోషి’. తెలుగు తెరపై అగ్రహీరోలందరితోనూ ఆడిపాడి అతిలోకసుందరిగా వెలుగొందారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించారు.
2017లో చివరిగా ‘మామ్‌’ చిత్రంలో నటించారు. తన కెరీర్‌లో 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకున్నారు. బాలీవుడ్‌లో తెరంగేట్రం తర్వాత 1996లో బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. శ్రీదేవి-బోనికపూర్‌ దంపతులకు జాన్వీ, ఖుషిలు ఉన్నారు. పెద్దమ్మాయి జాహ్నవి తొలి చిత్రం చిత్రీకరణ దశలో ఉంది.
భారత చిత్ర సీమలో శ్రీదేవికి ఉన్న గుర్తింపు అసాధారణం. ప్రపంచ వ్యాప్తంగా శ్రీదేవికి కోట్లాది వీరాభిమానులున్నారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టిన శ్రీదేవి బాలీవుడ్ నాయికగా సెటిలై అక్కడే బోనీకపూర్‌ని పెళ్లాడి లైఫ్‌లో సెటిలయ్యారు. శ్రీదేవి నట జీవితం అపూర్వం..

సినీ రంగానికి శ్రీదేవి అందించిన సేవలకు గుర్తుగా 2013లో భారత ప్రభుత్వం శ్రీదేవికి పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది.
చివరి క్షణాలు:
శ్రీదేవి చివరిగా యూఏఈలో జరిగిన బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ వివాహ వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్స్ సోనమ్ కపూర్, కరణ్ జోహార్, అనీల్ కపూర్ తదితరులు హాజరయ్యారు. చిన్న కూతురు ఖుషితో కలిసి ఆమె సెల్ఫీలు తీసుకున్నారు. అలాగే బోనీ కపూర్‌తో కలిసి నూతన వధూవరులతోనూ ఫోటో దిగారు. శ్రీదేవి ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుక ముగించుకొని తిరిగి వద్దామనుకునే సమయానికి అతిలోక సుందరి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ ఫోటోలు ఆమె చివరి జ్ఞాపకాలుగా మిగిలాయి. అంతకుముందు కూడా విదేశీ పర్యటనలో కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు.

Comments

Popular posts from this blog

కనిపిస్తే కబ్జా!