...చివరికి జానెడు జాగానూ ఇవ్వలేదు


...చివరికి జానెడు జాగానూ ఇవ్వలేదు
గ్రామంలో అంత్యక్రియలకు నిరాకరించిన స్థానికులు
 
కథువా: కథువా అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. దుండగుల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలికపై అందరూ ఆవేదన, జాలి చూపిస్తుంటే.. మరోవైపు ఆ చిన్నారి చనిపోయిన సమయంలో ఆ గ్రామస్థులు దారుణంగా ప్రవర్తించారు. మృతదేహం ఖననం చేయడానికి స్థలం కూడా ఇవ్వలేదట. ఈ ఘటనకు సంబంధించి నిర్ఘాంతపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కథువాలోని ఎనిమిదేళ్ల చిన్నారిపై దుండుగులు అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ గ్రామంలో చిన్నారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థానికులు నిరాకరించారట. దీంతో 8 కి.మీ దూరంలోని మరో గ్రామంలో చిన్నారి అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరి 17న చిన్నారి మృతదేహాన్ని రసానా ప్రాంతంలో గుర్తించారు. అనంతరం ఆ చిన్నారిని ఆ గ్రామంలోనే ఖననం చేయాలని తండ్రి భావించాడు. గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో అతని ముగ్గురు చిన్నారులు, తల్లి చనిపోయింది. వారిని ఖననం చేసిన చోటే ఈ చిన్నారి మృతదేహాన్ని పూడ్చిపెట్టాలని అతను నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ సమాధుల పక్కనే గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. ఆ స్థలం బక్రావల్‌ తెగకు చెందిన ఆ కుటుంబానిది కాదని పేర్కొంటూ గొయ్యి తవ్వకుండా అడ్డుకున్నారు. భూమికి సంబంధించిన పత్రాలను చూపిస్తూ మమ్మల్ని అక్కడి నుంచి స్థానికులు పంపించివేశారని బాలిక అమ్మమ్మ చెప్పారు.
అనంతరం విషయాన్ని తెలుసుకున్న బాలిక బంధువొకరు స్పందించి తనకు చెందిన  స్థలంలో ఖననం చేయాల్సిందిగా వారిని కోరాడు. బాలిక పెంపుడు తండ్రి ఆ స్థలాన్ని కొన్నాళ్ల క్రితమే ఓ హిందూ కుటుంబం నుంచి కొన్నాడని.. అయితే అందుకు తగిన పత్రాలను సరిగ్గా రాయించుకోలేదని అతను తెలిపాడు. దీన్నే అదనుగా చేసుకొని గ్రామస్థులంతా బాలిక మృతదేహాన్ని ఈ స్థలంలో ఖననం చేసేందుకు అడ్డుకున్నారని చెప్పాడు.
దీంతో ఆ గ్రామానికి 8 కి.మీ. దూరంలోని బక్రవాల్‌ తెగకు చెందిన వారు ఎక్కువగా నివసించే కనాహ్‌ గ్రామానికి బాలిక మృతదేహాన్ని వణికించే చలిలో బంధువులు తీసుకెళ్లారు. చీకటి పడకముందే అక్కడ గోతిని తీసి బాలిక మృతదేహాన్ని ఖననం చేశామని బంధువులు తెలిపారు. ‘ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని ఖననం చేయడానికి ఎంత స్థలం కావాలి? ఆ సమయంలో గ్రామస్థులు మంచి మనసును చూపించాలి. కానీ అలా చేయలేదు.’ అని బాలిక అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
బక్రవాల్‌ సంచార తెగకు చెందిన బాలిక జనవరి 10న అదృశ్యమై....వారం రోజుల తర్వాత అదే ప్రాంతంలో శవమై కనిపించింది. కథువాలోని ఓ ఆలయంలో ఆమెను బంధించి, మత్తుమందిచ్చి ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారన్న ఆరోపణలున్నాయి. తర్వాత ఆమెను అత్యంత భయంకరంగా హత్య చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు స్పెషల్‌ పోలీసు అధికారులు, ఓ హెడ్‌కానిస్టేబులు, ఓ సబ్‌ఇన్స్‌పెక్టరు కూడా ఉన్నారు.
 

Comments

Popular posts from this blog

కనిపిస్తే కబ్జా!