ఉద్యమం వైపు వెళ్తున్నానని పాకెట్‌ మనీ ఇవ్వలేదు


ఉద్యమం వైపు వెళ్తున్నానని
పాకెట్‌ మనీ ఇవ్వలేదు


త్రికాల సంధ్యావందనం చేసినవాడు...
రామాయణ మహాభారత, భాగవతాల్ని చదివినవాడు...
ఉపనిషత్తులను అర్థం చేసుకున్నవాడు...
వీరభక్తి నుంచి విప్లవ శంఖం పూరించాడు!
దేశంలోనే నెంబర్‌వన్‌ స్టూడెంట్‌గా నిలిచినవాడు... ఐఏఎస్‌ కాకుండా ఎర్రజెండా ఎత్తాడు!
పేరుకు సీతారాముడైనా మతతత్వంపై పరశురాముడిలా విరుచుకుపడుతున్నాడు.....
నిర్జీవమవుతుందనుకుంటున్న వేళ వామపక్ష ఉద్యమానికి జవజీవాలు నింపాలని...
చారిత్రక తప్పిదాల పార్టీ చరిత్ర తిరగరాయాలని తపిస్తున్నవాడు...
బెంగాలీ, మలయాళం, తమిళం, పంజాబీ, ఉర్దూ, హిందీ, ఆంగ్లాలను అనర్ఘళంగా మాట్లాడే
పదహారణాల తెలుగువాడు.... సీతారాం ఏచూరి!
ఈనెల 18 నుంచి హైదరాబాద్‌లో సీపీఎం జాతీయ మహాసభలు జరగబోతున్న నేపథ్యంలో ఈనాడు ‘హాయ్‌’తో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అంతరంగ ఆవిష్కరణ!!
* మొదట్నుంచీ విప్లవ భావాలున్న కుటుంబమేనా మీది?
మాది సనాతన సంప్రదాయ కుటుంబం. మా నాన్నగారివైపు దైవభక్తి ఎక్కువ. మా అమ్మవైపు హేతువాదులేమీ కాదు. దేవుడు ఉన్నాడు లేడు అనే రెండు భావనలకూ దూరంగా ఉంటారు. 11వ ఏటే నాకు వడుగైంది. త్రికాల సంధ్యా వందనం చేసేవాణ్ణి!! 15వ ఏట దాకా గుళ్లకు కుటుంబంతో వెళ్లేవాడిని!! మనలో చైతన్యం రాకముందు, మనిషి తనను తాను తెలుసుకోక ముందు అందరికీ ఎలాంటి పరిస్థితులుండేవో నాకూ అలానే ఉండేవి. రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత... చదివా. ఇప్పటికీ నోటికి వచ్చేస్తుంటాయి!
*మరి మార్క్సిజంతో పరిచయం ఎలా?
హైదరాబాద్‌లోనే నాలో విప్లవభావానికి బీజాలు పడ్డాయి. 1960ల్లో ఉస్మానియాలో జార్జిరెడ్డి ప్రభావం అందరిపైనా ఉండేది. నేనెన్నడూ ఆయన మీటింగ్స్‌కు హాజరుకాలేదుగాని... నారాయణ గూడ వైఎంసీఏలో చర్చలు జరిగేవి. అలా మార్క్సిజం ఓనమాలు హైదరాబాద్‌లోనే నేర్చుకున్నా. ఎవరూ ప్రభావితం చేసిన వ్యక్తి లేరు. కానీ... సిద్ధాంతం, భావజాలం నన్ను ఆకర్షించాయి. ఈ భావజాలానికి దిల్లీలో స్టీఫెన్‌్్సకు వచ్చాక సిద్ధాంతీకరణ జరిగింది. ఆ తర్వాత జేఎన్‌యూలో పూర్తిగా బలపడింది. అక్కడ ఉద్యమాలు, అకడమిక్‌ రెండూ ఏకకాలంలో సాగాయి. స్టడీ అండ్‌ స్ట్రగుల్‌ అనే నినాదాన్ని సృష్టించాం.
* దేశంలోనే చదువులో నెంబర్‌వన్‌గా నిల్చిన మీరు ఐఏఎస్‌ లాంటివాటికి ప్రయత్నించకుండా ఉద్యమాల వైపెలా మళ్లారు?
1967లో నక్సలైట్‌ ఉద్యమం, దేశవ్యాప్తంగా కుల సంఘర్షణలు... కాంగ్రెస్‌ ప్రభుత్వాల ఓటమి... దేశం ఎటుపోతోందో తెలియని సంఘర్షణ, నిరుద్యోగం పెరుగుదల, పెద్దస్థాయిలో సమ్మెలు... జేపీ ఉద్యమం... ఎమర్జెన్సీ... ఇవన్నీ నాపై ప్రభావం చూపించాయి. చైతన్యవంతులైన విద్యార్థులంతా నాడు సామాజిక పరిస్థితులపై చర్చించేవారు. దేశంలో పరిస్థితులు ఉద్యమాల్ని, విద్యార్థుల్ని చాలా ప్రభావితం చేస్తాయి. అవే నన్ను ఈ వైపు నడిపించాయి.
* ప్రగతిశీల భావాలున్న మీ పార్టీ అప్పటిలా ఇప్పుడెందుకని యువతరాన్ని ఎక్కువగా ఆకర్షించలేకపోతోంది? లోపం ఎక్కడుంది?
లోపంకంటే కూడా పరిస్థితులు మారాయి. పైన చెప్పుకొన్న ఆనాటి పరిస్థితులు తర్వాత లేవు. ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ... యువతరంలో కొత్తరకమైన భ్రమల్ని సృష్టించాయి. కోచింగ్‌ సెంటర్లు ప్రైవేటు కాలేజీలు పెరగటం... విద్యార్థి ఉద్యమాలు, చైతన్యపరిచే కార్యక్రమాలు తగ్గిపోవటం...పరిస్థితులపై చర్చలు జరగకపోవటం... దీంతో దాదాపు 20 సంవత్సరాలు భ్రమలకు గురై మూడునాలుగు తరాలు ప్రభావితమయ్యారు. మేం 70ల్లో అప్పటి పరిస్థితులకు ప్రభావితమైనట్లు వీరిప్పుడు భ్రమలకు ప్రభావితమయ్యారు. యువతరం ఇన్నాళ్లూ మా వైపు ఆసక్తి చూపకపోవటానికి ఇదో కారణం. ఐదారేళ్ల నుంచి పరిస్థితి మారుతోంది. భ్రమలు క్రమంగా తొలగుతున్నాయి. ట్రంప్‌ రావటం.. వీసాలు తగ్గించటం; పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం; నిరుద్యోగం పెరగటం వల్ల పరిస్థితి మారుతోంది.
* ఈ మార్పును సద్వినియోగం చేసుకునేందుకు సన్నద్ధంగా ఉన్నారా?
అదే మా పార్టీ ముందున్న సవాలిప్పుడు. అదే మేం చర్చించబోతున్న ప్రధాన ప్రశ్న! పార్టీ నిర్మాణాన్ని బలపర్చటానికి గతంలో చేసిన తీర్మానాన్ని అమలు చేయటంపై సమీక్షించబోతున్నాం.
*త్రిపురలో ఓటమి తర్వాత పొత్తులపై పునఃసమీక్షించుకోవాలనే వాదన మొదలైంది. పునః సమీక్ష పొత్తులకేనా? సిద్ధాంతాలపై కూడానా?
నేనెప్పుడూ పొత్తుల్ని పునఃసమీక్షించుకోవాలని అనలేదు. ఎందుకనో ఆ వాతావరణాన్ని సృష్టించారు. మతోన్మాద రాజకీయవాదులంతా మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే మా సిద్ధాంతానికి బలముంది. మా వద్ద ప్రత్యామ్నాయ విధానాలున్నాయి. ప్రస్తుతం చిన్నగా ఉన్నా, పెద్ద శక్తిగా ఎదగటానికి అవకాశం ఉన్నవాళ్లమని వారు గ్రహించారు. అందుకే బెంగాల్‌, త్రిపుర, కేరళలో... ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని తట్టుకొని మా పార్టీని, కేడర్‌ను కాపాడుకోవటం; ఉద్యమాలు చేయటం మా ప్రాధాన్యత! రెండోది- ఎలాంటి రాజకీయ, సామాజిక విధానాలు అనుసరించాలని నిర్ణయించుకోవటం! హైదరాబాద్‌ సమావేశాల్లో మా అజెండా!  ప్రజాఉద్యమాల్ని బలపర్చటం. అది ఏ విధంగా చేయాలి. కార్యాచరణ ఏంటనేది చర్చించబోతున్నాం. ఇక మీదట తేడాను చూస్తారు.
*తేడా అంటే... ఇక చారిత్రక తప్పులుండవంటారా?
దేశంలోని రాజకీయపార్టీల్లో తప్పు చేసిన తర్వాత చేశామని చెప్పే పార్టీ మాదొక్కటే! మరే పార్టీ ఆ పని చేయదు. కానీ మేం ఎప్పుడూ తప్పులే చేస్తామనే ప్రచారం చేశారు. మా ఉద్దేశంలో తప్పు చేయని మనిషి, ఉద్యమం లేదు. దాని నుంచి ఏం నేర్చుకుంటున్నామనేది ముఖ్యం. దాన్ని మళ్లీ చేయకుండటం అంతకంటే ముఖ్యం! అదీ మా గుణం.
* ఈ సమాజంలోని కుల, మత సమీకరణాల వాస్తవికతను అర్థం చేసుకోవటంలో వామపక్షాలు విఫలం చెందాయా?
విఫలం కాదు. అర్థం చేసుకున్నా వాటి ఆధారంగా ఎత్తుగడలు వేయటంలో విఫలమయ్యాం. వర్గపోరాటమనేది విదేశాలతో పోలిస్తే మనదేశంలో భిన్నమైంది. విదేశాల్లో వర్గపోరాటం ఆర్థిక దోపిడీకి సంబంధించిందే. మనదేశంలో రెండు కాళ్లపై నడుస్తోంది. ఒకటి ఆర్థిక దోపిడీ, రెండోది సామాజిక దౌర్జన్యం! ఈ రెండింటిపై కలసి పోరాటం చేయకుంటే ముందడుగు వేయలేం! ఒకకాలిపై కుంటుతూ పోతే కుదరదన్నది నా వాదన. ఆ బలహీనతను మేం అధిగమించాల్సి ఉంది.
* మార్క్స్‌ను లెనిన్‌ మారిస్తే... లెనిన్‌ను స్టాలిన్‌... స్టాలిన్‌ను మావో... మావోను డెంగ్‌... ఇలా ఒక్కొక్కరు కమ్యూనిజానికి, సోషలిజానికి కొత్త అర్థాలు చెబుతూ పోయారు! భారత కమ్యూనిస్టులే పాత సోవియట్‌ నమూనా వద్దే ఆగిపోయారెందుకు?
ఆ విమర్శ మాకు వర్తించదు. అది సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌)కు వర్తిస్తుంది. సోవియట్‌ పద్ధతి సీపీఐది! చైనా పద్ధతి సీపీఐ (ఎంఎల్‌)ది! మేం ఆ రెండింటినీ కాదని... భారతీయ కమ్యూనిస్టులుగా సీపీఎం అని పెట్టుకున్నాం. మేం సోవియట్‌, చైనా నమూనాల నుంచి పూర్తిగా దూరం జరిగాం. భారత పరిస్థితులకు అనుగుణంగా సామ్యవాద రూపకల్పనకు ప్రయత్నించాం! దీన్నింకా అభివృద్ధి చేయాలి. మేం భారతీయ మార్క్సిస్టులం కాబట్టే ఎదగగలిగాం. చైనీయులు వారి పరిస్థితుల ఆధారంగా సామ్యవాదాన్ని నిర్వచించుకుంటున్నారు. ఏ దేశమైనా అదే చేసింది. లెనిన్‌ ఎప్పుడూ మార్క్సిజం అంటే నిర్దిష్ట పరిస్థితుల నిర్ధిష్ట విశ్లేషణ అనేవాడు. నిరంతరం మారటమే!! అదే మార్స్కిజానికి లెనిన్‌ చెప్పిన నిర్వచనం!
*మరి అలాంటప్పుడు పార్టీ ఎక్కడ గాడి తప్పింది?
కొన్ని తప్పిదాలు జరిగాయేమోగాని మేమేమీ గాడితప్పలేదు. ప్రజల ఓట్లు కోల్పోవటానికి రెండు కారణాలు. ఒకటి పాలకవర్గాలు ప్రజల్లో సృష్టించిన భ్రమలు. రెండోది- మన సామాజిక, ఆర్థిక రంగంలో దోపిడీ దౌర్జన్యాల్ని ఎదురించటంలో పార్టీ వైఫల్యం!. అదే సమయంలో కొన్ని మంచి విజయాలూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకెళ్లలేకపోయాం! అవన్నీ మాకిప్పుడు అనుభవాలు, గుణపాఠాలు!
* ప్రపంచమంతటా కనుమరుగవుతున్న వేళ... నిజంగా ప్రస్తుత భారత సమాజంలో మార్క్సిజానికి స్థానముందా?
గతంలో కంటే ప్రస్తుత పరిస్థితుల్లోనే మనదేశానికి మార్క్సిజం అవసరం, ఆవశ్యకత బలంగా కన్పిస్తోంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలకు మార్క్సిజమే ఏకైక పరిష్కారమనేది నా నమ్మకం. భాజపా, కాంగ్రెస్‌లకు భిన్నంగా అభివృద్ధికున్న ఏకైక ప్రత్యామ్నాయం మా విధానమే.
* ఇంతకూ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా ఉండదా?
కాంగ్రెస్‌తో పొత్తనే విషయం మా పార్టీలో ఎప్పుడూ చర్చకు రాలేదు. మా పార్టీ చరిత్రను తీసుకొని చూసినా మీకీ విషయం తెలుస్తుంది. కేంద్రంలో దేవగౌడ సారథ్యంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడుగానీ, 2004లో ఎన్నికల తర్వాత ఏర్పడ్డ యూపీఏ ప్రభుత్వ వైఖరిలోగానీ మేం ఒకటే తీరుగా ఉన్నాం. కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం ఆధారంగా బయటి నుంచి మద్దతిచ్చామే తప్ప అధికారం పంచుకోలేదు. కాంగ్రెస్‌తో పొత్తనేది మా చైతన్యమే కాదు. మా చరిత్రలోనే లేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం మా చర్చల్లోనే లేదు. నా వాదనలో, మా పార్టీ వాదనలో ఈ విషయంలో భిన్నాభిప్రాయాలే లేవు. ఏం చేయాలి... ఎలా చేయాలనే ఎత్తుగడల్ని మాత్రం ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటాం. నేనేదో కాంగ్రెస్‌తో పొత్తుకు తహతహలాడుతున్నట్లు... మిగతావాళ్లు వద్దంటున్నట్లు ఓ దుష్ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదు
*మీ పార్టీ దాదాపు మూడు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా పరిపాలించిన బెంగాల్‌ అభివృద్ధి ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది! మరి అలాంటప్పుడు మీ ప్రత్యామ్నాయ పాలన, విధానాలు దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ఎలా నమ్మేది?
బెంగాల్‌ అనేది ఒక రాష్ట్రమే. మనది సమాఖ్య దేశం. అన్ని కీలక నిర్ణయాలు కేంద్రం తీసుకుంటుంది. ఒక రాష్ట్రం సోషలిజాన్ని తీసుకురాలేదు. కాబట్టి... కేంద్రంలో అధికారం చేపట్టేదాకా ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు.
*అంతగా సిద్ధాంతంపై నమ్మకమున్న మీరు ఎందుకని తోకపార్టీగా ఉంటారు? మతతత్వ పార్టీలను గద్దెదించటం కోసం ఎవరితోనైనా చేతులు కలిపేందుకు సిద్ధం అనే బదులు మీరే ఎదిగేందుకు ఎందుకని ప్రయత్నించరు?
అలా ఎవరంటారో తెలియదుగాని... మేమైతే స్పష్టంగా ఉన్నాం. మతతత్వాలని నేనెన్నడూ అనను. మతోన్మాద రాజకీయానికి మేం వ్యతిరేకం. అదే సమయంలో స్వయంగా ఎదగాలనే ప్రయత్నిస్తున్నాం. మా మహాసభల్లో అదే చర్చించబోతున్నాం. నాకైతే ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ విధానాలున్న పార్టీని ఆదరిస్తారనే నమ్మకం బలంగా ఉంది. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకున్నాం. వాటి ఆధారంగా ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. ప్రజా ఉద్యమాల్ని బలపరిస్తేనే మేం బలపడతాం. మహారాష్ట్రలోని మొన్నటి రైతుల లాంగ్‌మార్చ్‌ ఓ ఆశాదీపం! 2015లో ఈ లాంగ్‌మార్చ్‌కు బీజాలు పడ్డాయి. తొలి మీటింగ్‌ నుంచి ఆఖరిమీటింగ్‌ దాకా నేను వారితో ఉన్నాను.
* మీరనుకుంటున్న విప్లవం సాధ్యమై కేంద్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పటికల్లా ఏర్పడే అవకాశం ఉందనుకుంటున్నారు?
అదెప్పుడూ చెప్పలేం. పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయినా విప్లవం ఎప్పుడొస్తుంది. ఎన్నేళ్ల తర్వాత వస్తుందనేది కాదు విషయం!! వచ్చిన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అనేది కీలకం. 1917లో నవంబరు 5న లెనిన్‌ అన్న మాట ఇక్కడ చెప్పాలి. విప్లవానికి ఆరో తేదీ టూ ఎర్లీ... ఎనిమిదో తేదీ టూ లేట్‌... అన్నాడు. ఏడునాడే రావాలన్నాడు. భారత్‌లో విప్లవం అలాగే వస్తుంది. కాబట్టి... ఎప్పుడొస్తుంది... ఎన్నేళ్ల తర్వాత వస్తుందనేది ప్రధానం కాదు. ఆ పరిస్థితులు కలిగినప్పుడు అదే తన్నుకొని వస్తుంది.

నిజాం టెన్నిస్‌ ఛాంపియన్‌ను! మామూలు విద్యార్థినే!! పుస్తకాల పురుగునేం కాదు. టెన్నిస్‌ ఆడేవాణ్ణి. 1968లో నిజాంకాలేజీ ఛాంపియన్‌ను కూడా! డిబేట్స్‌లో పాల్గొనేవాడిని. మా అమ్మ వాళ్లింట్లో అంతా హేతుబద్ధంగా ఉండేవి. కందా భీమశంకరంగారు మా తాత! ఆయనకు ఆంగ్లంలో పట్టుండటమే కాకుండా మంచి తెలుగు పండితుడు. ఆంధ్రపద్రేశ్‌ హైకోర్టు బెంచిలో న్యాయమూర్తిగా చేశారు. ఆయన ద్వారా పుస్తకాలు చదవటం అలవాటైంది.
రొమాంటిక్‌ పాటలంటే ఇష్టం

హిందీ సినిమాల్లో రొమాంటిక్‌ పాటలంటే ఇష్టం! హైదరాబాద్‌లో ఉన్నప్పుడే ఉర్దూ, షేరెషాయరీల ప్రభావం నాపై పడింది. అదే హిందీ సినిమాల్లోని రొమాంటిక్‌ పాటలపై ఇష్టాన్ని పెంచింది. రఫి, కిశోర్‌, లతా... ఇలా అందరిపాటలూ ఇష్టమే! ముషాయిరాల్లో పాల్గొని... ఏదో నోటికి వచ్చింది... అలా అలా వదిలేసేవాడిని! కవిత్వం ఎన్నడూ రాయలేదు.
ఆరెస్సెస్‌ వాళ్లకు నచ్చదు

భగవద్గీత, ఉపనిషత్తులను నా ప్రసంగాల్లో కోట్‌ చేస్తుంటాను. కమ్యూనిస్టువై ఉండి వాటినెలా వాడతావని ఆరెస్సెస్‌ వాళ్లు నన్ను ఆక్షేపిస్తుంటారు. మేం భారతీయ మార్క్సిస్టులం కాబట్టే వాటన్నింటినీ ఉల్లేఖిస్తుంటానంటాన్నేను. ఆరెస్సెస్‌ వాళ్లకు అదే నచ్చదు. మా పార్టీలో సీనియర్లకు కూడా దీనిపై  ఎలాంటి అభ్యంతరం లేదనే అనుకుంటాను.
నంబర్‌వన్‌గా నిలిచా

నాన్న ఆర్టీసీలో డివిజినల్‌ మేనేజర్‌గా చేసేవారు. విజయవాడ, ఏలూరు, గుంటూరుల్లో కొద్దిరోజులు తప్పిస్తే... నా చదువంతా హైదరాబాద్‌లోనే జరిగింది. తాత, అమ్మమ్మల వద్ద  ఉండి చదువుకున్నాను. రెండో తరగతి నుంచి ఆల్‌ సెయింట్స్‌లోనే చదువుకున్నా. హెచ్చెస్సీ ఇక్కడే చేశా. పీయూసీ కోసం నిజాంకాలేజీలో చేరా. అప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైంది. 1968లో ఏడాది చదువు పోయింది. అప్పుడు నాన్న దిల్లీకి మారటంతో ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లో ఓ ప్రభుత్వ బడి ఉండేది అక్కడి నుంచి పీయూసీకి సమానమైన కోర్సు పూర్తి చేశా. అప్పుడే ఆలిండియా బోర్డు పరీక్షలో జాతీయ నెంబర్‌వన్‌గా నిలిచా! 1970లో దిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో డిగ్రీలో (ఎకనామిక్స్‌) చేరా.
కష్టాలను మతం మార్చలేదు

ప్రతి మతంలోనూ హేతుబద్ధతుంటుంది. మానవత్వం ఉంటుంది. మతాన్ని నమ్మటంలో తప్పులేదు. కానీ అది పూర్తిగా వ్యక్తిగతమైంది. కానీ మతం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయనేది మేం నమ్మం. మతంలో చాలామంది తమ సౌఖ్యాన్ని చూసుకుంటారు. నిజజీవితంలో సమస్యల్ని పరిష్కరించనంత కాలం ఆ సౌఖ్యం ఓ భ్రమగానే మిగిలిపోతుంది.  ప్రజల సమస్యలను మతం మార్చలేదు. నిర్ధిష్ఠ పరిస్థితులను మారిస్తేనే సమస్యలు తీరుతాయి.
సుందరయ్యా!
నా మనవడిని విడిచిపెట్టయ్యా!
ఐఏఎస్‌ కావాలని కుటుంబం నుంచి చాలా ఒత్తిడి వచ్చింది. మేనమామ మోహన్‌కందా నాకంటే వయసులో కాస్త పెద్ద. వరుసకు మేనమామైనా అన్నాదమ్ముల్లా పెరిగాం. ఆయన ఐఏఎస్‌ అవటంతో నేను కూడా ఆయన బాటలో పయనించాలని ఇంట్లో ఎంతో ఒత్తిడి. జేఎన్‌యూలో పరిశోధన చేద్దామని చేరాక ఎమర్జెన్సీ వచ్చింది. దీంతో పూర్తిస్థాయి మార్క్సిస్టుగా మారిపోయా.

దీనివల్ల నా కుటుంబం... ముఖ్యంగా అమ్మమ్మ, తాతకు చాలా అసంతృప్తి. ఇంత బాగా చదివే తెలివైన కుర్రాడు ఉద్యమాలంటూ రోడ్లు పట్టుకు తిరగటం ఏంటని చాలా బాధపడ్డారు. ఓ రోజు మా అమ్మమ్మ పుచ్చలపల్లి సుందరయ్యగారి దగ్గరికి వెళ్లి ‘నా మనవడిని ఎందుకు పట్టుకున్నావ్‌? వదిలెయ్‌’ అని అడిగింది కూడా! ఆయన తెలివిగా సమాధానమిచ్చారు. ‘నీ మనవడిలాంటి వాడిని నాకు చూపించు... నీ మనవడిని వదిలేస్తాను’ అనటంతో అమ్మమ్మ నిరాశగానే అయినా కాసింత గర్వంగా వెనక్కి వచ్చింది. మనసులో బాధ ఉన్నా అప్పట్నుంచి నా మనవడిలాంటివాడు ఎవడూ లేడని మా అమ్మమ్మ గర్వపడేది. వారిలో అసంతృప్తి ఉండేదిగాని నాపై వ్యతిరేకత ఏమీ లేదు. నాన్న ఓసారి ‘నీ దారి నువ్వు చూసుకుంటుంటే నేనెందుకు నీకు డబ్బులివ్వటం’ అని కొద్దినెలలు పాకెట్‌మనీ ఇవ్వటం ఆపేశారు. అలాగైనా లొంగిపోయి దారికొస్తాననని ఒత్తిడి తెచ్చారాయన. కానీ అదే సమయంలో నేషనల్‌ ఫెలోషిప్‌ పేరిట స్కాలర్‌షిప్‌ వచ్చింది. దాంతో నాన్న డబ్బుల కోత ప్రభావం, ఒత్తిడి లేకుండా పోయింది. ఎంతండీ నెలకు రూ.400. అదే ఎంతో ఎక్కువ. 



తొలి వివక్ష అక్కడే  
సెయింట్‌ స్టీఫెన్స్‌లో సంపన్న శ్రేణి పిల్లలే ఎక్కువ! ముగ్గురమే ప్రభుత్వ బడుల్లో చదివి వెళ్లినవాళ్లం! తొలిసారి వివక్షను చూశానక్కడ. అంటే కులపరంగా కాదు. వర్గపరంగా! మధ్యతరగతి నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లందరిలోనూ ఓ అంతర్గత శక్తి ఉంటుంది. మన లక్ష్యానికి కట్టుబడి ఉంటే తప్పకుండా ఎక్కడైనా రాణిస్తాం. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు... ఎలా ఉంటున్నామనేది, ఎలా ఉండాలనుకుంటున్నామనేది ప్రధానం! అవకాశం వాదం కాకుండా... తాను కట్టుబడిన చైతన్యానికి మనఃస్ఫూర్తిగా పనిచేస్తే ఎవరినీ ఎవరూ ఆపలేరు.

అదే మా బలహీనత
ఉద్యమాలను ఓట్లగా మలచుకోలేకపోవటమే మా బలహీనత! దీన్ని అధిగమించాల్సి ఉంది. ఆర్థికరంగ పోరాటాల్లో ప్రజలంతా మమ్మల్ని నమ్ముతున్నారు. ఉద్యమాల్లో మాతో ఉంటున్నారు. ఓట్ల దగ్గరకు వచ్చేసరికి  సామాజిక ఆధారాల వైపు మళ్లుతున్నారు. ఈ వైవిధ్యం ఎందుకొస్తుందనేది ప్రశ్న. ప్రజల చైతన్యం రెండు విధాలుగా ఉండదు. ఆర్థికరంగంలో మేం కల్పించిన భరోసాను సామాజిక రంగంలో కల్పించలేకపోయాం. సామాజిక దౌర్జన్యాల విషయంలోనూ మీకు అండగా ఉంటామనే నమ్మకాన్ని ప్రజల్లో సృష్టించలేకపోయాం. అదే ఇప్పుడు మేం చేయాలి. అందుకే లాల్‌ నీల్‌ నినాదం ఇచ్చాం. ప్రతి ఫ్యాక్టరీ గేటుపై ఎర్రజెండా ఎగిరినట్లే... గ్రామాల్లో దళితుల్ని నీరు తాగనీకుండా చేసే ప్రతి కుళాయిపైనా ఎర్రజెండా ఎగరాలి.

Comments

Popular posts from this blog

కనిపిస్తే కబ్జా!