సాంకేతిక ప్రతిసృష్టి

సాంకేతిక ప్రతిసృష్టి

3డీ ముద్రణ పరిజ్ఞానంతో అవయవాల నమూనాలు

క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో వైద్యులకు తోడ్పాటు అందిస్తున్న ఎన్‌ఐటీ

ఈనాడు - వరంగల్‌


ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న త్రీడీ ముద్రణ పరిజ్ఞానం ద్వారా ఎలాంటి వస్తువునైనా అచ్చుగుద్దినట్లుగా తేలికగా ముద్రించుకోవచ్చు. వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్‌ఐటీ)లోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఈ సాంకేతిక పరిజ్ఞానంతో క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో వైద్యులకు తోడ్పాటు అందిస్తోంది. ఎన్‌ఐటీలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌కు చెందిన ‘అడిటివ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌/ ర్యాపిడ్‌ ప్రోటోటైపింగ్‌ ల్యాబ్‌’ విభాగంలో త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో శరీర అవయవ భాగాల నమూనాలను రూపొందిస్తున్నారు. దీనివల్ల రోగికి శస్త్రచికిత్స చేసే ముందు త్రీడీ అవయవ నమూనాపై సర్జరీ చేసి సాధ్యాసాధ్యాలను సరిచూసుకునే వెసులుబాటు కలుగుతోంది. క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేందుకు ఈ నమూనాలు వైద్యులకు ఎంతో ఉపకరిస్తున్నాయి. ఇప్పటిదాకా 8 కేసుల్లో ఎన్‌ఐటీలోని ప్రోటోటైపింగ్‌ ల్యాబ్‌లో అవయవాల నమూనాలను ముద్రించి ఇచ్చి విజయవంతమయ్యారు. త్రీడీ అవయవం కొలతల ఆధారంగా రోగికి అమర్చాల్సిన లోహపు ఇంప్లాంట్స్‌ను కూడా వైద్యులు విదేశాల నుంచి తెప్పిస్తున్నారు.

ఎంతో మందికి వరం

హైదరాబాద్‌కు చెందిన ఎనిమిదేళ్ల దీక్షతకు దవడ కుడివైపు అభివృద్ధి చెందలేదు. ఆ అమ్మాయి నోరు పూర్తిగా తెరవలేక, మాట్లాడలేక, ఘన పదార్థాలు కూడా తినలేని పరిస్థితి నెలకొంది. కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే ఇచ్చేవారు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు దంతవైద్య ఆసుపత్రి ఆ అమ్మాయికి శస్త్రచికిత్స చేసేముందు ఎన్‌ఐటీ సాయం తీసుకుంది. బాధితురాలి ఎడమ వైపు దవడ భాగాన్ని స్కానింగ్‌ చేసి.. త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో ఎన్‌ఐటీ ప్రయోగశాలలో రూపొందించి ఇవ్వగా.. దాని సాయంతో వైద్యులు దీక్షితకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ఇప్పుడామె నోరు పూర్తిగా తెరచుకుంటోంది. ఘనపదార్థాలు కూడా తినడం సాధ్యమవుతోంది. నెల్లూరుకు చెందిన 21 ఏళ్ల యువతికీ ఇదే తరహాలో శస్త్రచికిత్స చేసి, సమస్యను పరిష్కరించారు.
* ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి దంతాలు విరిగి, దవడ భాగం దెబ్బతింది. అతని మరో దవడ భాగాన్ని స్కాన్‌ చేసి, త్రీడీ ముద్రణ పరిజ్ఞానంతో అవయవ నమూనాలు రూపొందించి ఇవ్వగా, దీనిసాయంతో మెటల్‌ ఇంప్లాంట్‌ అమర్చి, వైద్యులు నాలుగు దంతాల్ని అమర్చగలిగారు.
* త్వరలో శరీరంలోని కీలక భాగాలైన గుండె, కాలేయం, ఊపిరితిత్తుల్లాంటి అవయవాలకు శస్త్రచికిత్స చేసేప్పుడు తోడ్పడేలా ఈ విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గుండెకు బైపాస్‌ సర్జరీ చేసే క్రమంలో ఉపకరించే ఒక భాగం నమూనాను కూడా ఈ విధానంలో రూపొందించి ఇచ్చారు. నమూనా అవయవాలను త్రీడీ ముద్రణలో అయిదారు గంటల వ్యవధిలో విద్యార్థులు ముద్రిస్తున్నారు.
* అవయవాల నమూనాలే కాకుండా, మనుషులను స్కాన్‌చేసి వారి ప్రతిబింబాలను, దేవతల విగ్రహాలు, కార్లు, ఇతర వాహనాల విడిభాగాలను కూడా రూపొందిస్తున్నారు.

త్వరలో మెటల్‌ ఇంప్లాంట్స్‌ 

 మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ‘అడిటివ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌’ కోర్సు దేశంలోనే తొలిసారి 2014లో వరంగల్‌ ఎన్‌ఐటీకి మాత్రమే వచ్చింది. ప్రస్తుతం మావద్ద 10 మంది ఎంటెక్‌, నలుగురు పీహెచ్‌డీ చేస్తున్నారు. దీనిపై విస్తృత పరిశోధనలు సాగిస్తున్నాం. ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాలిమర్‌ ప్లాస్టిక్‌ పదార్థాలతో అవయవాల నమూనాలను మాత్రమే ముద్రించి, వైద్యులకు తోడ్పడుతున్నాం. త్వరలో డీఎస్టీ ప్రాజెక్టు నిధులతో రూ. 2 కోట్లతో అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేసి, శరీరంలోపల అమర్చగలిగే మెటల్‌ ఇంప్లాంట్స్‌ కూడా త్రీడీ పరిజ్ఞానంతో ముద్రించనున్నాం.  

- డా।।వై.రవికుమార్‌,
అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఎన్‌ఐటీ, వరంగల్‌.

 

Comments

Popular posts from this blog

కనిపిస్తే కబ్జా!